ఉపాయం
ఉదాహరణకి ఈనాడు సైటు తీసుకుందాం. ఈ సైటుని ఫైర్‌ఫాక్స్ లో తెరిచినట్లైతే, ఇదిగో ఆ పక్క బొమ్మలో చూపినట్టు కనబడుతుంది. ఈనాడు ఒక్కటే కాదు, తెలుగులో కొన్నేళ్ళ నుంచి ఉంటున్న చాలా సైట్లు అలాగే ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్నింటిని ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో మాత్రం సరిగ్గానే చూడొచ్చు. అయినా అన్ని సైట్లకి కలిపి ఒక పరిష్కారం ఉంటే బావుంటుంది కదూ, అది కూడా మనకిష్టమైన ఫైర్‌ఫాక్స్ విహారిణిలో! ఉండనే ఉంది! అదే, పద్మ అని వెన్న నాగార్జున గారు మొదలుపెట్టిన ఒక ఫైర్‌ఫాక్స్ పొడిగింత(ప్లగిన్). ఇక్కడికెళ్ళి Add to Firefox లేదా Install అని కొడితే ఆ పొడిగింత ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి ఫైర్‌ఫాక్స్ మూసి తెరవాలి. ఇకనుంచి మీరు ఏ తెలుగు సైటు కెళ్ళినా అందులో సమస్యేంటో తెలుసుకుని అదే సరిచేసేస్తుంది. ఏ చింతా లేకుండా తెలుగు సైట్లు చూసుకోవచ్చు.
వివరణ
ఇప్పుడు, ఒక సగటు మనిషికి అర్థమయ్యే మాటల్లో, అసలు ఆ సైట్లు ఎందుకు అలా ఉన్నాయో చూద్దాం.
ఇదివరకు, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రిందట, కంప్యూటర్లో తెలుగు భాషకి ఒక అధికారిక ప్రామాణికమంటూ ఒకటి లేదు. కానీ తెలుగువారికి కుడా అంతర్జాలంలో సైట్లు ఉన్నాయ్ కదా, అవి తెలుగులోనే ఉండాలి కాబట్టి, ప్రామాణికాలేవీ లేకపోయే సరికి ఎవరికి వారే ఒక ప్రామాణికం ఏర్పాటుచేసుకున్నారు. ఎలా అంటే, ఒకరు "A" అంటే "అ" అనుకుంటారు. ఇంకొకరు "A" అంటే "క" అనుకున్నారు. ఇలా అప్పటికి కంప్యూటర్లో ప్రామాణికాలున్న లాటిన్ అక్షరాలను తెలుగు అక్షరాలకు ఎవరిష్టంవచ్చినట్టు వాళ్ళు మ్యాప్ చేసేసుకున్నారు. అలా పుట్టినవే ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు వచ్చేశాయ్. కానీ ఇప్పుడు పరిస్థితి మారి యూనీకోడ్ అనే ఒక వ్యవస్థ పుట్టుకొచ్చింది. అది ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్లు, బ్లాగులు, అన్నీ ఆ ప్రామాణికాన్నే వాడుతున్నారు. ఈ యూనీకోడ్ అన్ని కంప్యూటర్లలోనూ బాగానే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించండి. కానీ సారూ! ఈ 10-15 సంవత్సరాలుగా ఉన్న సైట్ల మాటేమిటి? అని మీరడగొచ్చు. హా..! సరిగ్గా ఇదే ఆలోచన నాగార్జున గారికి ఎప్పుడో వచ్చిందేమో, అందుకే ఆ "ఎవరికివారు చేసుకున్న" ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా ఒక ఉపకరణం తయారుచేయాలని సంకల్పించారు. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులు ఆ ఉపకరణానికి తమతమ తోడ్పాటుని అందించారు. నేటికి పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల సామర్థ్యానికి ఎదిగింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి