ప్రోగ్రాం అంటే :- కొన్ని నియమాలను పాటిస్తూ, ఒకానొక క్రమంలో అమలుపరచడం కోసం రాసిన కొన్ని ఆదేశాలు. ఉదాహరణకి, నేను ఈ క్రింద ఇచ్చిన ఆదేశాలను కలిపి ఒక ప్రోగ్రాం అనొచ్చు.
1(౧). ఒక సంఖ్య అడుగు2(౨). ఇంకో సంఖ్య అడుగు3(౩). ఆ రెంటిని కూడు4(౪). వచ్చిన ఫలితం ప్రింట్ చెయ్యి.
ఇది ప్రోగ్రామే. కానీ ప్రస్తుతానికి దీన్ని అర్థం చేస్కునే యంత్రం లేదు! ఎలా అర్థమవుతుంది మరి? యంత్రాలకు మనుషులు మాట్లాడే భాషలు అర్థం కావాయే! కాబట్టి యంత్రాలకు సులువుగా అర్థమయ్యేట్టు చెప్పేలా, కొన్ని భాషలు రూపొందిచారు. వాటినే యంత్రభాషలు అంటాము. మనం నిత్యం వినే C, C++, Python, Java వంటివి అన్నీ ఈ యంత్రభాషలే! మీరు మీ వాళ్లతో మాట్లాడడానికి తెలుగు ఎలా వాడతారో, యంత్రాలతో మాట్లాడాలంటే ఈ యంత్రభాషలు కూడా అలాగే నేర్చుకుని వాడాలి. ఈ భాషలు కంప్యూటర్ వాడే అందరికి రానక్కరలేదు, ఆ యంత్రాన్ని వాడుకోవడానికి మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ల వంటివి నిర్మించాల్సి ఉంటేనే అవసరం.
ఇలా యంత్రాన్ని నియంత్రిస్తూ దాని చేత పనులు చేయించే విధానాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. అంటే, ప్రోగ్రామ్లు రాయడమే ప్రోగ్రామింగ్ అన్నమాట!
ఉదాహరణకి, ఆ పైనున్న ఆదేశాల్ని, పైతాన్ భాషలో రాస్తే ఇలా ఉంటుంది.
మొదటి_సంఖ్య = raw_input("మొదటి సంఖ్య ప్రవేశ పెట్టండి: ")రెండో_సంఖ్య = raw_input("రెండో సంఖ్య ప్రవేశ పెట్టండి: ")కూడిక = int(మొదటి_సంఖ్య) + int(రెండో_సంఖ్య)print కూడిక
ఇదే ఒక పైతాన్ ప్రోగ్రాం. నేను దీన్ని రాస్తూ చేసిన పనే ప్రోగ్రామింగ్. రాసినా వాడ్ని, అంటే ఇక్కడ నన్ను, ప్రోగ్రామర్ అంటారు.
నిజ జీవితం లో ప్రోగ్రామ్లు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఉదాహరణకి, మీరు ఒక విండో తెరవాలి అనుకున్నారనుకోండి. తెరవడానికి ఎక్కడోకక్కడ మౌస్ తో నొక్కుతారు కదా. అలా మీరు పలానా చోట నొక్కితే పలానా విండో తెరుచుకోవడం, ప్రోగ్రామింగ్ మహిమే. అక్కడ నొక్కితే ఆ విండో తెరుచుకోవాలని ముందే ప్రోగ్రాం చేశారన్న మాట. మీరు కంప్యూటర్ వాడే అనుక్షణం ప్రతి పనికి ఏదో ఒక ప్రోగ్రాం ని వాడుతూనే ఉన్నట్టు లెక్క. అందుకే, కంప్యూటర్ దేహమైతే, ప్రోగ్రాం ఆత్మ!
ఇక, ముఖ్యమైన యంత్ర భాషల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చాలా మంది ఏ యంత్ర భాష నేర్చుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. వారికి ఇది ఉపయోగపడుతుంది. ఒక్కొక్క భాష గురించి వివరంగా వాటి వాటి టపాల్లో తెలుసుకుందాం.
౧. C/C++
ఈ భాషలో రాసిన ప్రోగ్రాం యంత్రం పై చాలా వేగవంతంగా నడుస్తుంది! ఈ భాషలో చాలామంది చాలా కృషి చేశారు కాబట్టి, ఇప్పటికే ఎన్నో లైబ్రరీలు వెలశాయి. అంటే, ఏంతో మంది చేసిన పరిశ్రమ మీరు మళ్ళీ చేయనక్కర్లేదు, తీసుకుని వాడుకోవొచ్చు. కంప్యూటర్(సాఫ్ట్వేర్) చరిత్రలో ఎంతో ముఖ్య ఘట్టంగా వెలిగిన UNIX పరిణామం ఈ భాషలోనే జరిగింది!
ప్రోగ్రాం రాయడం కొంచెం కష్టమైనా, చాలా వేగంగా నడవాలి అనుకుంటే ఈ భాషే మార్గం!
౨. పైతాన్
ఇది C/C++ కన్నా కాస్త నెమ్మదైనా, వాడటం చాలా సులువు. పైగా దీనికి ఇంటర్ప్రిటర్ సదుపాయం ఉంటుంది. అంటే, మీరు ఏదైనా పనిలో మీకు వచ్చిన ఆలోచన వచ్చినట్టు వెంటనే ఆచరణలో చూడాలి అనుకుంటే, పైతాన్ కి ఒక షెల్ లాంటిది ఉంటుంది, అందులో ప్రయత్న పూర్వకంగా చేసి చూసుకోవచ్చు. పైగా, ఇందులో కూడా విస్తృతమైన లైబ్రరీ సంపద ఉంది. ఇంకా, తక్కువ లైన్ల కోడ్ తో, ఎక్కువ పని కూడా అయిపోతుంది.
"ధనాధన్! ఫటాఫట్!!" పనుల కోసం ఈ భాష చాలా బావుంటుంది.
౩. జావా
దీనిలో, పైన చెప్పిన రెండు భాషా ప్రపంచాల్లోను ఉండే మంచి గుణాలు ఉన్నాయి, అయితే, పైతాన్ లో ఉన్నంత సౌకర్యం ఉందని మాత్రం చెప్పలేను. వేగంలో C/C++ కన్నా కాస్త తక్కువ. ఒక ప్రోగ్రాం అన్ని ప్లాట్ఫారంల మీద ఏ మార్పులు లేకుండా పని చేయడానికి ఈ భాష ని ఎక్కువుగా వాడుతుంటారు. అంటే, మీరు విండోస్ లో, విండోస్ కి రాసినా అప్లికేషను/ప్రోగ్రాం ఎటువంటి మార్పు అవసరం లేకుండా, లినక్సు లో కూడా పని చేస్తుంది. పై రెండు భాషల్లో కూడా అలా చెయ్యొచ్చు కానీ, కాలక్రమేనా వాటిల్లో ప్రతి ఆపరేటింగ్ సిస్టంకి ప్రత్యేకమైన విభాగాలు కలవడం వల్ల ఇప్పుడు కాస్త సంక్లిష్టంగా తయారయ్యాయి.
ఇంకా ఇవే కాక, శతకోటి యంత్ర భాషలున్నాయి! అయితే, మీ అవసరాన్ని బట్టి ఒకటి నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. అలా ఒక భాష నేర్చుకున్నాక, మిగతావి నేర్చుకోవడం అంత కష్టం అనిపించదు, నీళ్ళు తాగినట్టే ఉంటుంది!
ఇకనుంచి వరుసగా వచ్చే పాఠ్యాంశాల్లో పైతాన్ నేర్చుకుందాం!!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి