మొదటి భాగంలో, అసలు హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు, పార్టిషన్లు ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం.
మొదటి భాగం చదివాకా, అసలు హార్డ్‌డిస్క్ లో పార్టిషన్స్ ఎందుకు? మొతం కలిపి ఒక్కటిగా వాడుకోలేమా? అని మీరు అడగొచ్చు!
ఏమండీ, మొతం ఇల్లు ఒకే గదిలా కూడా వాడుకోవచ్చండి! కానీ ఆది అనువైన పద్దతి కాదని మనకి తెలుసు కదా. ఉదాహరణకి, ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు దంపతులున్నారనుకోండి, ఒక్కొక్క జంట కి కనీసం ఒక్కొక్క గది ఉండాలి కదా? లేకపోతే కొన్ని విషయాల దగ్గర వద్దనుకున్నా వస్తాయ్ సమస్యలు! ఇక్కడ కూడా అంతే, రెండు OS లను తెచ్చి ఒకే పార్టిషన్ లో పెట్టేస్తే, ఆ రెండు వాటి నిర్మాణరీత్యా కొన్ని ఫోల్డర్లు, ఫైళ్లు కలిపి వాడేసే ప్రమాదం ఉంది. ఆది కాస్తా అందులో ఒక OS కి కావాల్సిన చాలా ముఖ్యమైన ఫైల్ అనుకోండి, ఇక ఆ OS పని తీరులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఒక్కొక్క OS కి ఒక్కొక్క పార్టిషన్ అవసరం.
హా, ఇప్పుడు మీరు వెంటనే ఊపిరి కూడా తీస్కోకుండా అడిగేసే రెండో ప్రశ్న! నాకు రెండు OS లు లేవోయ్! ఒక్కటే ఉంది! ఐనా కూడా ఒక పార్‌టిషన్ తో సర్దుకోకూడదంటావా? అని! దాని వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి సుమా.
ఒక వస్తువు పెట్టిన చోటు గుర్తు లేకపోతే పెద్ద గది లో వెతకడం కష్టం. కానీ అదే రెండు మూడు గదులుండి, ఏ కిచన్ లొనో, వరండా లొనో మర్చిపోయాను అని గుర్తుంటే వెతుక్కోవడం సులువు. ఇక్కడ కూడా అంతే. మనం వెళ్ళి వెతకం, ఆ పని చేయడానికి OS ఒక సూచిక నిర్మించుకుంటుంది. ఒకే పార్టిషన్‌లో పెట్టేస్తే ఏవేవి సూచికలో ఉండాలో నిర్దేశించే పట్టు కోల్పోతాం. పైగా వంట గదినిండా చీమలున్న సర్దుకోవచ్చేమోగాని, పడకింట్లో కూడా అదే చందమైతే చెట్టునీడో గమాక్సిన్ కంపో గతి! ఒకే గదైతే అందులో ఏ సమస్యొచ్చినా ప్రతి పనికి అడ్డే అవుతుంది. ఇక్కడ కూడా, అదనపు పార్టిషన్‌లు ఉండటం వల్ల ఏ ఒక పార్టిషన్‌లోనో సమస్య వస్తే అది ఆ పార్టిషన్‌లో సమస్యేనని పసిగట్టడం గుర్తించడం ఒక ఉపయోగం, మిగతా పార్టిషన్‌లు దాని వల్ల ఇబ్బందులెదుర్కోకపోవడం ఇంకో ఉపయోగం.
కానీ అలా అని బోల్డన్ని చిన్న చిన్న పార్టిషన్‌లు పెట్టేసుకున్నారంటే, చిక్కుల్లో పడతారు! ఎందుకంటే, ఒక వస్తువుని ఒక గది నుంచి ఇంకో గదికి మార్చడం, ఒకే గదిలో అమరికలు మార్చడం కన్నా కాస్త కష్టం. హర్డ్‌డిస్క్ లో కూడా ఒక పార్టిషన్ నుంచి ఇంకో పార్టిషన్ కి ఏదన్న పెద్ద ఫైల్ ని కదపాలి అంటే, అదే పార్టిషన్ లో వేరే చోటకి కదపడం కన్నా కష్టం. కాబట్టి ఆలోచించి, మీకు సరిపడినన్ని పార్టిషన్ లు చేస్కోండి. ఉదహరణకి, ఇన్స్టలేషన్ కి ఒకటి, మీ రోజువారీ ముఖ్యమైన విధులకి ఒకటి, సినిమాలకి సంగీతానికి ఇంకోటి పెట్టుకోవచ్చు. పైగా, ఎన్ని పార్టిషన్‌లు పెట్టుకోవచ్చు అనే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి, అవేంటో తర్వాతి భాగంలో చూద్దాం.
ఇప్పుడు, అసలు ఒక ఫైల్, అదే పార్టిషన్ లో వేరే చోటికి ఐతే అంత వేగంగా కదిలిపోయి, ఇంకో పార్టిషన్ కి కదపాలి అంటే అంత సమయం ఎందుకు పడుతుందో కారణం తెలుసుకుందాం. ఎందుకు అంటే, మొదటి భాగంలో చెప్పుకున్నట్టు, ఒక పార్టిషన్ మీద ఫైళ్లు ఎలా నిక్షిప్త పరచాలో ఫైల్ సిస్టమ్ వివరణలోనే ఉంటుంది. ఇది ప్రతి పార్టిషన్ కి వేర్వేరుగా నిర్దేశితమై ఉంటుంది. ఈ వివరాలు, ఏ పార్టిషన్ కి ఆ పార్టిషన్ వేర్వేరు గా విడిగా ఉంటయ్ కాబట్టి, ఒక ఫైల్ ఒక పార్టిషన్ నుండి ఇంకో పార్టిషన్ కి కదపడం అంటే, ఆ ఫైల్ ఉన్న పార్టిషన్ లో ఉంచి, వేరే పార్టిషన్ లో దాని నకలుని కొత్తగా బద్రపరిచి, ఆ అసలు పార్టిషన్ నుంచి తీసేయ్యడం కిందే లెక్క. అదే ఆ ఫైల్ ఏ పార్టిషన్ లో ఉందో ఆ పార్టిషన్ లోనే వేరే చోటికి మనం కదిపినట్టైతే, ఈ తంతు అంతా ఉండదు. ఎటూ ఆ పార్టిషనే కాబట్టి, ఆ ఫైల్ ని ఆ పార్టిషన్‌లో ఎక్కడ చూపించాలి అన్న సమాచారాన్ని మాత్రమే మారిస్తే సరిపోతుంది. దానికి ఇసుమంతైనా సమయం పట్టదు. అందుకే ఆ తేడా!
మీకు కొన్ని కొన్ని సాధారణంగా అందరికి కలిగే సందేహాలు కలగొచ్చు.
సందేహం ౧. ఒకే ఫోల్డర్/ఫైల్ నాకు చాలా చోట్ల అందుబాటులో ఉండాలి. అప్పుడు దాన్ని అన్ని చోట్లకి నకలు చెస్కోవాలా?
జవాబు: అవసరం లేదు. అందుకే షార్ట్‌కట్స్ ఉన్నాయి. షార్ట్‌కట్ అంటే ఒక లంకె లాంటిది. ఇంట్లో ఒకే ఫోన్ కనెక్షన్ కి ఒకటే బిల్ చెల్లిస్తు, ఇంటి వైశాల్యాన్ని బట్టి సౌకర్యార్డం రెండు మూడు ఫోన్ లు పెట్టుకోగలినట్టే, ఒక ఫైల్ ని, ఆది ఒక్క కాపీ ఏ ఉంటే ఎంత జాగా తీస్కుంటుందో, ఎన్ని లంకె లు ఉన్న అంతే జాగా తీస్కుంటుంది. ఎక్కువ లంకె లు పెట్టుకున్నందుకు అదనపు జాగా ఆక్రమించదు. లినక్సులో లంకె సృష్టించాలంటే, టెర్మినల్ ద్వారా ఈ కమాండ్ వాడాలి. దీనికి, మీరు ఏ ఫోల్డర్/ఫైల్ కి లంకె కావాలనుకుంటున్నారో అది ఎక్కడికి కావాలనుకుంటున్నారో ఆ కమాండ్ కి చెప్పాలి. ఉదాహరణకి, నేను /media/sda3/Music ఫోల్డర్ కి /home/gopi లో Music అనే పేరుతొ లంకె వేయాలి అనుకుంటున్నాను. అప్పుడు క్రింది కమాండ్ ఇస్తాను. మీరు ఏ పేరు తో లంకె వేయాలి అనుకుంటున్నారో ఆ పేరుతో అప్పటికే ఎమన్నా ఫోల్డర్లు/ఫైళ్లు లేకుండా చూస్కోండి.
ln -s /media/sda3/Music /home/gopi/Music
సందేహం ౨. నా హార్డ్‌డిస్క్ మునిగిపోతోంది. కానీ నాకు తెలిసి నేను బద్రపరిచిన పెద్ద ఫైళ్లు అన్నీ ఏరీ తీసేసను. కానీ ఇంకా కనబడని ఏవో కొన్ని ఫైళ్లు అనవసరంగా నా హార్డ్‌డిస్క్ ని కబ్జా చేసేస్తున్నాయ్. కాపాడుకోలెనా?
జవాబు: మీ హార్డ్‌డిస్క్ మీ ఇష్టం. కబ్జా చెదానికి ఎవడొస్తే మాత్రం ఏంటి, పీకి పాతరేయొచు. కాకపోతే అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. దానికి లినుక్సులో "డిస్క్ యూసేజ్ అనలైసర్" అని ఒకటుంది. ఈ మద్య వచ్చే ఉబుంటు లలో మెయిన్ మెనూలో ఆక్సెసరీస్ లో ఉంది. ఆల్ట్-f2 కొట్టి baobab కమాండ్ రన్ చేసినా వస్తుంది. ఒకవేళ లేకపోతే ఈ క్రింది కమాండ్ తో ఇన్స్టాల్ చేస్కొండి.
sudo apt-get install baobab
ఆది ఎలా వాడాలో చూద్దాం. మీరు ఆ కంమంది కొట్టినా, మెనూ లోనుంచి ఎంచుకున్న, ఒక విండో తెరుచుకుంటుంది. ఇలా..
అందులో, మీకు అనుమానం కలిగిన ఫోల్డర్ ని స్కాన్ చేయొచ్చు. ఉదాహరణకి, ఫలానా ఫోల్డర్ లో మీకు కనిపించేవి తక్కువ సైజు లోనే ఉన్నా, కనబడనవి ఏవో చాలా సైజు ఉన్నట్టున్నాయ్ అనిపిస్తే, ఆ విండో లో, మెనూ లో Analyzer అని ఉంటుంది, అది నొక్కి, Scan a folder ఎంచుకుని, మీరు సందేహపడ్డ ఫోల్డర్ ని ఎంచుకోండి. ఒకవేళ తెలియకపోతే, Scan filesystem అని ఎంచుకుంటే మొత్తం హార్డ్ డిస్క్ ని స్కాన్ చేసేస్తుంది. స్కాన్ పూర్తయ్యాక, మీకు వివరాలు ఈ క్రింది బొమ్మలో లాగా చూపిస్తుంది. అందులో ఎక్కువ సైజు లో ఉన్నదేంతో మీరు యిట్టె పసిగట్టేయోచ్చు. ప్రయత్నించి చూడండి.
తర్వాతి భాగంలో పార్టిషన్ ఎలా సృష్టించాలి, ఏయే అవసరాలకి ఏ రకాల ఫైల్ సిస్టంలు మంచివి అనే అంశాలు చూద్దాం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి