ఈ పాఠ్యాంశంలో మనం హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకుందాం. మీకు లినక్స్ఇన్‌స్టాల్ చేసిన కంప్యూటర్ ఉంటే, ఇందులో చెప్పేవి మీరు కూడా ప్రయత్న పూర్వకంగా చేసినట్టు ఉంటుంది. విండోస్ వాడేవాళ్ళు, ఏమి చేయనక్కర్లేదు, చూస్తే సరిపోతుంది :) కాకపోతే చేసే త్రిల్ ఉండదు :) మీకు టెర్మినల్ గురించి అస్సలు తెలియకపోతే కనుక, టెక్ సేతు సైట్ లో ఉన్న "షెల్ గూర్చి నేర్చుకుందాం" అనే ట్యూటోరియల్ చదివితే ఒక అవగాహన వస్తుంది.
ఇక విషయం లోకి వస్తే,
కంప్యూటర్ కొన్నప్పడు, కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేస్కునేటప్పుడు ఇలా చాలా సమయాల్లో హార్డ్‌డిస్క్ గురించి, దానికి సంబందించిన పనుల గురించి వింటూ ఉంటాం. ఈ పాఠ్యాంశంలో హార్డ్‌డిస్క్ కంప్యూటర్ లో ఎలా ఉపయోగపడుతుందో, మనం తీస్కోవాల్సిన జాగ్రత్తాలేంటో చూద్దాం. మీరు లినక్స్ లోను, విండోస్ లోను, స్టార్ట్ మెనూ లో ఉన్న ప్లేసెస్ లో "కంప్యూటర్" మీద క్లిక్ చేస్తే ఒక విండో తెరుచుకుంటుంది. ఇలాగ..
అందులో మన సిస్టమ్ లో ఉన్న పార్టిషన్ లన్నీ చూపిస్తుంది. ఇప్పుడు వాటి వెనకున్న విషయాలు ఎంటో తెలుసుకుందాం.
కంప్యూటర్ లో శాశ్వతంగా నిక్షిప్త పరచాల్సిన సమాచారాన్ని దాచడానికి ఉపయోగపడే సాధనం హార్డ్‌డిస్క్. అంటే పవర్ సప్లై లేకపోయినా, మీరు పొందుపరిచిన సమాచారం అలాగే ఉండేలా చూసే ఒక ఆధారం. దాన్ని ఉపయోగించే విధానం లో, జాగ్రత్తగా గమనిస్తే, దానికి ఇల్లుకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. మనం ఒక గది నిర్మాణానికి కావాల్సిన జాగాని మీటర్లలోనో, అడుగులలోనో కొలుస్తాం. అలాగే, హర్డ్‌డిస్క్ లో జాగాని, బైట్స్ లో కొలుస్తారు. 1000 బైట్ లు ఐతే 1 కిలోబైట్ అని, 1000 కిలోబైట్లు ఐతే ఆది ఒక మెగబైట్ అని, 1000 మెగబైట్లు ఐతే ఆది 1 గిగాబైట్ అని అంటాం, అంటే 1 జి.బి అన్నమాట. ఒక గది కట్టాలి అంటే దానికి కొంత ఖాళి స్థలం ఎలా అవసరమో, ఒక కొత్త పార్టిషన్ కావాలి అనుకుంటే హార్డ్‌డిస్క్ లో కొంత ఖాళీ జాగా కూడా అలాగే అవసరం.
గది కట్టిన తర్వాత గోడలు, మెట్లు లాంటివి కొంత బాగం ఆక్రమించుకున్నట్టే, హార్డ్‌డిస్క్ లో ఆ పార్టిషన్ నిర్మాణ సమాచారం కూడా హార్డ్‌డిస్క్‌లో కొంత జాగా ఆక్రమిస్తుంది.(ఇది బయటకి మనకు కనబడదు, జాగా కూడా చాలా తక్కువే అనుకోండి, కానీ ఆ పార్టిషన్ ఆపరేటింగ్ సిస్టం (OS) తో ఎలా అనుసందానించబడుతుందో తెలుసుకోవడానికి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవడం దోహద పడుతుంది. ఈ నిర్మాణ విధానాన్నే మనం ఫైల్ సిస్టమ్ అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫైల్ సిస్టమ్ అంటే గది కట్టే విధానం. ఒక్కొక్క కట్టడానికి కొన్ని కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నట్టే, ఒక్కో ఫైల్ సిస్టం కి కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. అవి వచ్చే పాఠ్యాంశంలో చూద్దాం. పార్టిషన్ లో మనం పెట్టె ఫైళ్లు అందులో బద్రపరచబడే విధానం కూడా ఫైల్ సిస్టం ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి, కొన్ని ఫైల్ సిస్టమ్ లలో, ఫైల్స్ అమరిక చిందరవందరగా తయారవడం వల్ల హార్డ్‌డిస్క్ నుంచి వాటిని ఉపయోగిచాలంటే టైమ్ ఎక్కువ పడుతుంది, దీని వల్ల సిస్టమ్ నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఇది విండోస్ లో ఫ్యాట్(FAT) ఫైల్ సిస్టమ్ వాడే వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు డీ-ఫ్రాగ్‌మెంట్ చేయాలి. ఈ-నాడులొ డీ-ఫ్రాగ్‌మెంటేషన్ పాఠ్యాంశం చదివి అదెలాగో తెలుసుకోండి. ఇక తర్వాత ఆ పార్టిషన్ ఉపయోగించేటప్పుడు, మనం దాని మీద బద్రపరిచే ప్రతి ఫైల్ కొంత బాగాన్ని ఆక్రమిస్తుంది.
ఇప్పుడు చెప్పుకున్న వాటికి సంబందించివన్నీ ఒకసారి లినుక్సు లో చూద్దాం. లినక్సులో ఇలాగే కాక, విండోస్ లో చూసినట్టే చూసే మార్గాలు కూడా ఉన్నాయి. ఐతే, ఇక్కడ నేనెంచుకున్న మార్గం టెర్మినల్‌ని మీకు దగ్గర చేసి, తర్వాత్తర్వాత మీకు ఉల్లీ, తల్లీ కలిపి చేసినా చేయని మేలు చేస్తుంది. ముందు. మన హార్డ్‌డిస్క్ సైజ్ ఎంతో, ఆది ప్రస్తుతానికి ఎన్ని పార్టిషన్లగా విభజించబడిందో చూద్దాం. ఈ క్రింది చూపిన కమాండ్ కొడితే ఆ బొమ్మలో లాగా వస్తుంది అవుట్పుట్. విండోస్ లో ఉన్నవారు, My Computer మీద రైట్ క్లిక్ చేసి, Manage ఆప్షన్ ఎంచుకోండి, ఒక విండో తెరుచుకుంటుంది. అక్కడ Disk Utilities ఉంటుంది, అది ఎంచుకుంటే కనిపిస్తుంది.
sudo fdisk -l
fdisk -l కమాండ్ అవుట్పుట్
ఇప్పుడు ఒక పార్టిషన్ సైజ్, ఎంత ఉపయోగించబడింది, ఎంత జాగా మిగులుంది లాంటి వివరాలు చూద్దాం. ఈ క్రింది కమాండ్ కొట్టండి. అక్కడున్న /dev/sda2 ని మీకు పైనున్న fdisk -l అవుట్పుట్లో చూపించిన పార్టిషన్‌ల లోనుంచి ఒకదానితో మార్చి ఇవ్వాలి కమాండ్. విండోస్ వాడేవారు My Computer మీద నొక్కితే, అక్కడా ఒక్కక్క డ్రైవ్/పార్టిషన్ వివరాలు కనిపిస్తాయి.
sudo df -h /dev/sda2
df -h /dev/sda2 కమాండ్ అవుట్పుట్
ప్రస్తుతానికి OS ఎక్కుపెట్టిన మొత్తం పార్టిషన్‌లని చూడాలి అనుకుంటే ఉత్తినే df -h కొడితే సరిపోతుంది. అంటే, ప్రస్తుతానికి మనం వాడగలిగే పార్టిషన్ల వివరాలన్నమాట.
df -h
df -h అవుట్పుట్
తర్వాతి పాఠ్యాంశంలో పార్టిషన్లు ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం. అసలు హార్డ్‌డిస్క్ ని ఇంటితో ఎందుకు పోల్చానో అందులో బాగా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి