ముందు సైట్ అంటే ఏంటో చూసి తర్వాత బ్లాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైట్ అంటే అంతర్జాలం లో ఒక సంస్థగాని, వ్యక్తిగాని కృత్రిమంగా హాజరు కావడానికి వాడే ఒక సాధనంలా చెప్పుకోవచ్చు. ఐతే ఇప్పటి పరిస్థితికి ఆ నిర్వచనం సరిపోదు. ఉదాహరణకి గూగుల్ ని తీస్కుంటే, శోధన యంత్రం కూడా ఒక సైటే, కానీ అదో ఉపకరణం! అది ఒక సంస్థ గురించో, వ్యక్తి గురించో చెప్పటం లేదు. ఇలా ఇప్పుడు సైటు అంటే, అంతర్జాలం లో ఉండే ఏదైనా కావచ్చు అన్న స్థితి నెలకొంది. మరి బ్లాగు కూడా సైటేనా అన్న అనుమానం మీకు రావచ్చు. అవును! బ్లాగు కూడా ఒక రకం సైటే! కానీ, బ్లాగ్(blog) అంటే వెబ్లాగ్(weblog), అంటే "వెబ్ లాగ్", అంటే అంతర్జాలం లో మనం ఏదైనా అంశం గురించిన కొన్ని విషయాలు పొందుపరచడానికి వాడే ఒక సైటు. ఉదాహరణకి నా బ్లాగ్ టిడ్బిట్స్ తీస్కుంటే, అందులో నా జీవితం గురించి, కొన్ని సమస్యల గురించి రాస్తుంటాను. ఇలా ఎవరికీ నచ్చిన అంశం గురించి వాళ్ళు రాసుకోవచ్చు. వచ్చే టపాలలో వరుసగా బ్లాగులు, సైటులు ఎలా వాడుకోవాలి. సొంతవి ఎలా నిర్మించుకోవాలి అన్న అంశాలు రాస్తాను.
అందాకా, అందరూ ఎక్కువగా వాడే, ఉచితంగా వచ్చే బ్లాగుల గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీరు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా సొంతంగా ఒక బ్లాగు ఏర్పాటు చేస్కోవచ్చు. నెటిజన్లు ఎక్కువగా వాడే వర్డుప్రెస్సు, బ్లాగ్స్పోట్ ల గురించి తెలుసుకుందాం.
మీకు జిమెయిల్ ఎకౌంటు ఇప్పటికే ఉండి ఉంటే ఇంకా ఎకౌంటు సృష్టించుకునే పని లేకుండానే ఇక్కడికి వెళ్లి బ్లాగ్స్పోట్ లో బ్లాగడం మొదలెట్టేయోచ్చు. ఒకవేళ జిమెయిల్ ఎకౌంటు ఉన్నా కూడా, వర్డుప్రెస్సుని ప్రియంగా వాడేవారు చాలామందే ఉన్నారు, కాబట్టి మీరు సీరియస్ గా బ్లాగడం మొదలెట్టే ముందు ఒకసారి రెండింటిని చూడడం మేలు. ఏది నచ్చితే దానికి మళ్ళిపోవచ్చు. వర్డుప్రెస్సు ఎకౌంటు ఇక్కడికి వెళ్లి సృష్టించుకోవచ్చు. ఉచిత ఎకౌంటు లో తెలుసుకోవలసినవి ముఖ్యంగా మూడు విషయాలు. రెండిటిల్లోను తెలుగు సౌలభ్యం ఉంది. ఉచిత ఎకౌంటు లో మనం చేయగలిగేవతిల్లో ముఖ్యమైనవి ఇక్కడ చెప్తాను.
- కొత్త టపా ఎలా రాయాలి?
- బ్లాగు రూపు ఎలా మార్చాలి?
- అందరికి తెలిసేలా ఏం చేయాలి?
ముందుగా మీరు మీ డాష్‌బోర్డ్ లో ఉన్నారేమో చూస్కోండి. లేకపోతే పైన ఉన్న పట్టీలో Dashboard అని ఉంటుంది, అది నొక్కండి. వివరణ కొరకు క్రింద ఉన్న బొమ్మ చూడండి.
ఇప్పుడు అక్కడ ఎరుపు మార్కుతో చూపించిన Dashboard పై నొక్కితే ఈ క్రింద చూపించిన పేజీకి వస్తారు.
౧. కొత్త టపా ఎలా రాయాలి?
క్రింద బొమ్మలో చూపించినట్టు ఆ డాష్‌బోర్డ్ పేజీలోనే పైన ఏడమచేతి వైపు "కొత్త టపా" అని ఉంటుంది. అక్కడున్న త్రికోణం గుర్తుపైకి మౌస్ ని తెస్తే(నొక్కకుండా) అది మిగతా ఆప్షన్లని కూడా చూపిస్తుంది. అక్కడ మీరు కొత్త టపా లేదా కొత్త పేజీ నొక్కి వాటిని సృష్టించుకోవచ్చు. పేజీకి టపాకి ఒక తేడా ఉంది. మీ గురించి చెప్పడానికో, లేదా సైటులో ఎప్పుడూ కనబడాలనుకునే ఒక విషయమో ఐతే, దాన్ని పేజీలా రాసుకోవాలి. రోజూవారి రాతలన్నీ టపాలలాగా రాసుకోవాలి. ప్రయత్నించండి.౨. బ్లాగు రూపు ఎలా మార్చాలి?
ఇక్కడ బ్లాగు కనిపించే విధానం ఎంచుకోవడమెలాగో తెలుసుకుందాం. డాష్‌బోర్డ్ పేజీలో కుడివైపునున్న పట్టీలో కొంచెం క్రింద, "కనిపించు" అని ఉంటుంది. అక్కడ ఉన్న త్రికోణం మీద నొక్కితే క్రింద చూపించినట్టు దానిక్రింద అమర్చబడ్డ మిగతావన్నీ కూడా చూపిస్తుంది. రూపు మార్చుకోవాలంటే "అలంకారాలు" లోకి వెళ్ళాలి. అక్కడ రకరకాల అలంకారాలని(థీమ్స్) చూపిస్తుంది. క్రింద బొమ్మ చూడంది. వాటిల్లో మీకు నచ్చింది, మీ బ్లాగుకి సరిపోయేది దాని మీద నొక్కి ఎంచుకోండి. ఆ అలంకారం మీ బ్లాగుకి వర్తింపచేసి చూపిస్తుంది, మీకు నచ్చితే "సచేతనమగు" అని పైన ఏడమ చేతివైపునున్న లంకెను నొక్కండి, లేదంటే అక్కడ x మార్కు నొక్కి మూసేయండి.ఇంకా "కనిపించు" క్రింద ఉన్న విడ్జెట్లు, Custom Header, శీర్షపు రంగులు కూడా మీ బ్లాగు రూపురేఖల్ని మార్చడానికి ఉపయోగించవచ్చు. మీ బ్లాగుని సందర్శిస్తే అక్కడ పక్కన ఉన్న పట్టీలలో ఉండే వివిధ రకాల లంకెలు విడ్జెట్లు వాడగా వచ్చేవే. ఉదాహరణకి మీ బ్లాగులో మీరు ఇటీవల రాసిన టపాలు పక్కన పట్టీలో కనబడాలంటే, "విడ్జెట్లు" మీద నొక్కి "ఇటీవలి జాబులు" ని మౌస్ తో పట్టుకుని "పక్కపట్టీ" అని ఉన్న దానిలో పడేయడమే. ప్రయత్నిస్తే తెలుస్తుంది, ప్రయత్నించి చూడండి. అలా పడేశాక ఇదిగో ఈ క్రింద చూపించినట్టు కనిపించాలి ఆ పేజీ.
Custom Header కి వెళితే మీ బ్లాగుకి పైన వచ్చే బొమ్మని మీకు ఇష్టంవచ్చిన బొమ్మతో మార్చుకోవచ్చు. కానీ, బొమ్మ అది చెప్పిన పరిమాణంలోనే ఉండాలి సుమా! బొమ్మ మార్చాక అక్కడ ఉన్న అక్షరాల రంగు ఆ బొమ్మ మీద బావుండకపోవచ్చు. కాబట్టి "శీర్షపు రంగులు" మీద నొక్కి అక్కడ, పైన బొమ్మ మీద వచ్చే అక్షరాల రంగుని మార్చుకోవచ్చు. ప్రయత్నించండి.
౩. అందరికి తెలిసేలా ఏం చేయాలి?
మీది తెలుగుబ్లాగైతే, కూడలిలోనూ, జల్లెడలోనూ మీ బ్లాగు కలపమని అభ్యర్థించవచ్చు. వేరే భాషలో బ్లాగైతే వాటికి తగ్గ బ్లాగుసమాహారాలు ఉంటాయి, వాటిల్లో కలపాలి. ఇంకా మీ సైటుకి ట్విట్టర్ ని అనుసందానించడం, మీ స్నేహితులకి తెలిసేలా మీ gtalk స్థితిలో మీరు కొత్త టపా రాసినప్పుడు ఆ లంకె పెట్టడం లాంటివి మీ బ్లాగు ప్రాచుర్యానికి దోహదం చేస్తాయి. కానీ, ముఖ్యంగా మీరు చేయవల్సింది ఒకటుంది! మీ బ్లాగు శోధనయంత్రాలకి కనబడేలా చేయడం. ఇది ఎలా అంటే, క్రింద బొమ్మలో చూపించినట్టు డాష్‌బోర్డ్ లో పక్కనున్న పట్టీలో ఉన్న "అమరికలు" లో "అంతరంగికత" లోకి వెళ్ళి అక్కడ మొదటి ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు చెప్పినవాళ్ళు తప్ప ఎవరికీ కనబడకూడదన్నా దానికి తగ్గ ఆప్షన్ ని కూడా ఎంచుకోవచ్చు.బ్లాగుకి ఏమౌతుందోనని ఏమాత్రం భయపడకుండా ఆ పట్టీలలో ఉన్నవన్నీ ఒకసారి కలియతిరిగేసి ప్రయత్నించేస్తే అన్నీ అర్థమవుతాయి, మొదలెట్టండి మరి :)
వర్డుప్రెస్సు లో ఉచితంగా వచ్చే బ్లాగులలో ప్రకటనలిచ్చుకోవడం(advertisements ఇవ్వడం) కుదరదు. కానీ బ్లాగ్స్పోట్ లో ఆ సదుపాయం ఉంది. ఇలా ఉచితంగా కాక, సొంతగా కూడా సైట్ నిర్వహించుకోవచ్చు. అదెలాగో ఇక్కడున్న టపాలో చూడండి :)
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి