సొంత సైటు నిర్మాణానికి రాస్తున్న టపాలలో నాల్గవది.
మన "సొంతంగా ఒక సైట్ నిర్మించుకోవడం" అనే అంశంలో మూడు పోస్టులు చూశాము - సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?, సొంత సైట్ లో వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?,బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ. ఇప్పుడు వర్డుప్రెస్సు తో నిర్మించుకున్న సైట్ ని కొత్త అలంకారాలతో, ప్లగిన్లతో ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.
౧. థీమ్ లు/అలంకారాలు
అసలు అలంకారం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే మన వేస్కునే బట్టలు లాంటివే ఈ అలంకారాలు. పంచె, సూట్, లంగోటా ఇలా రకరకాలుగా ఉన్న బట్టల్లో మనం రకరకాలుగా కనబడ్డట్టే, ఒక్కొక్క అలంకారానికి సైట్ కి ఒక్కో రూపం వస్తుంది, ఉదాహరణకి వంటల బ్లాగో, కామర్స్ బ్లాగో మొదలెడితే, వాటికి తగ్గ బొమ్మలు, డిజైన్ ఉన్న అలంకారం ఎంచుకోవాలి. ఇప్పుడు అలాంటి అలమ్కారాల్ని ఎక్కడ పట్టాలో, పట్టి మన సైట్ లో ఎలా పెట్టాలో చూద్దాం.
- ఈ లంకెకు వెళ్లి, కావాల్సిన విషయానికి తగ్గ అలంకారాన్ని ఎంచుకోండి. అది దింపుకుని ఆ వచ్చిన జిప్ ఫైల్ ని ఎక్కడైనా విప్పండి(అన్జిప్ చేయమని).
- అలా విప్పగా వచ్చిన ఫోల్డర్ ని మీరు వర్డుప్రెస్సు సైట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసారో, అక్కడ wp-content అనే ఫోల్డర్ లో themes అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
- ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు(అడ్మిన్ పానెల్) కి వెళ్ళండి. అక్కడ పక్కపట్టీ లో కనిపించు/Appearence లో అలంకారాలు/Themes అని ఉంటుంది. అది నొక్కితే, మీరు ఇందాక పెట్టిన అలంకారం అక్కడ కనిపిస్తుంది. ఆ అలంకారాన్ని Activate చేస్తే మీ సైట్ రూపు ఆ అలంకారానికి మారిపోతుంది.
- ఆ అలంకారం లో అన్నీ నచ్చి, ఒకటీ రెండు చోట్ల మార్పూ కావాలి అనుకుంటే మీకు CSS పరిజ్ఞానం కావాలి (టెక్ సేతు లో దాని పై కూడా పాఠ్యాంశాలు వస్తాయి). మీకు కొద్దో కొప్పో తెలుసనే అనుకుంటే ఆ అలంకారానికి సంబందించిన సమాచారం అంతా మీరు ఇందాక themes ఫోల్డర్ లో పెట్టిన ఆ అలంకారం ఫోల్డర్ లోనే ఉంటాయి. చాలా వరకు ఆ అలంకారం కూర్పులు, చేర్పులు style.css ఫైల్ లోనే నిక్షిప్తమయ్యి ఉంటాయి.
౨. ప్లగిన్లు/పొడిగింతలు
అలంకారం హంగుకి, ఆర్భాటానికి ఐతే పొడిగింతలు సైట్ పనితనానికి, అంటే మీరు రూపు రేఖల్లో కాకుండా సైట్ లో కొత్తగా ఎమన్నా చేర్చాలనుకుంటే ఆ పని చేసేవే పొడిగింతలు. ఉదాహరణకి మీ సైట్ ని శోధన యంత్రాల్లో బాగా కనిపించేలా చేయాలన్నా, మీరు రాసినా టపాల్లో కొన్ని నియమాల్ని అనుసరించి కొన్ని పోస్టులనే ఎంచి అవి పాఠకులకి చుపించాలన్నా, అసలు ఇఅంటి పనులు ఏం చేయాలన్నా మనకు పొడిగింతలు అవసరం. అవి ఎక్కడ సంపాదించి ఎలా ఉపయోగించాలో చూద్దాం.
- ఈ లంకెకు వెళ్లి, మీకు కావాల్సిన పనికి సంబందించిన పదాలతో వెతికితే కొన్ని ఫలితాలొస్తాయి. అందులోంచి మీకు నచ్చినది ఎంచుకుని దించుకోండి.
- ఆ దించిన జిప్ ఫైల్ ని విప్పి మీరు వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసిన చోట, wp-content అనే ఫోల్డర్ లో plugins ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
- ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు కి వెళ్లి, పక్కపట్టీలో Plugins అని ఉంటుంది. అది నొక్కితే ఇందాక మీరు పెట్టిన ఆ పొడిగింతని చూపిస్తుంది. దాన్ని Activate చేస్తే ఇంకా వాడుకోవచ్చు. పొడిగింత ఎలా వాడుకోవాలో మీరు అది దించుకున్న పేజీలోనే ఉంటుంది.
ఒకవేళ మీకు కావాల్సిన పొడిగింత దొరకకపోతే, మీరే అది తాయారు చేసుకోవచ్చు. కాకపోతే దానికి PHP పరిజ్ఞానం అవసరం అవుతుంది (టెక్ సేతు లో భవిష్యత్ లో వీటి మీద కూడా పాఠ్యాంశాలుంటాయి). తర్వాతి టపాలో, ప్రతి సైట్ కి కావాల్సిన ముఖ్యమైన పొడిగింతల జాబితా చూసి అవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. దృపాల్ లో సైట్ నిర్మాణం కూడా మొదలుపెడదాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి