చాలా మంది విండోస్ లో ప్యాకేజీలు ఇన్‌స్టాల్ చేస్కోవడానికి అలవాటు పడి, లినక్సుకి వచ్చేసరికి, కొంచెం తేడాగా ఉండే సరికి, కష్టమేమో అని గాబరాపడిపోతారు. కాని, అది ఒఠ్ఠి భయం మాత్రమే. ఈ పాఠ్యాంశంలో ఉబుంటు, ఫెడోరాలలో కొత్త పాకేజీలు ఎలా ఇన్‌స్టాల్ చేస్కోవాలో చూద్దాం.
ఉబుంటు ఐతే
ఉబుంటు లో మొత్తం మూడు పద్దతుల్లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. ఒక్కక్కటి చూద్దాం. ముందు మనం, ప్రాధమికంగా సిస్టం ని ప్యాకేజీ లు తెచ్చుకునే విధంగా సెటప్ చేస్కోవాలి. ఉబుంటు ఇన్స్టాల్ చేసిన కొత్తలో, ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లని తీసెయ్యడం తప్పితే కొత్త అప్లికేషనులు తెచ్చుకోవడానికి ఉండదు. కానీ, మనం కొన్ని సోర్సులు కలిపితే ఆ సౌలభ్యం కల్పించుకున్నవారమవుతాం. దానికి ఇలా చేయాలి.System లో Administration లో Synaptic Package Manager ఉంటుంది. దాన్ని తెరవండి. అది ఇలా బొమ్మలో లాగా ఉంటుంది.
ఒకవేళ మీకు మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినవారు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చివుంటే ఈ స్టెప్ లో ఉన్నది చెయ్యండి. లేదంటే ఈ స్టెప్ అవసరం లేదు. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లో పైన మెనూ లో Settings లో Preferences నొక్కితే, ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అందులో, Network ట్యాబు కి వెళ్లి, అక్కడ మీ ప్రాక్సి వివరాలు ఇచ్చేయండి.
ఇందులో, పైన మెనూ లో ఉన్న Settings లో Repositories మీద కొడితే, ఇంకో విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అక్కడ, Ubuntu Software ట్యాబు క్రింద ఉన్నవన్నీ టిక్ చేసెయ్యండి. పక్కన Other Software లో డీఫాల్ట్గా ఉన్నవాటిని టిక్ చేసెయ్యండి. ఇదే విండో లో, updates ట్యాబు లో మీ సిస్టం తాజాకరణ వివరాలు సవరించుకోవచ్చు. ఇక ఆ విండో మూసెయ్యండి. ఇప్పుడు మర్చిపోకుండా, మొదటి విండో లో పైన ఉన్న Reload బటన్ కొట్టడం మర్చిపోవద్దు! అది కొడితే, మీరు కొత్తగా టిక్ పెట్టిన సైటుల్లోనుంచి ఉన్న ప్యాకేజీ వివరాలు లోడ్ చేస్తుంది. మీరు గమనించాల్సిన విషయం - రీలోడ్ చేసినప్పుడు ప్యాకేజీలను డౌన్లోడ్ చేయదు, వాటి వివరాలు - పేరు, అదేం చేస్తుంది లాంటివి, మాత్రమే తెస్తుంది.
ఇక సెటప్ పూర్తయ్యినట్టే! ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేయడం అరటిపండు ఒలిచి నోటి దగ్గర పెడితే తిన్నట్టే ఉంటుంది.
౧. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్
ఇప్పటి దాకా, మనం పైన చెప్పుకున్న సెటప్ అంతా చేసింది ఇందులోనే. దీన్ని తెరవడానికి, System లో Administration లో ఉన్న Synaptic Package Manager ని క్లిక్ చేయాలి. ఇందులో, పైన ఒక శోధన బాక్స్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన పదాలతో వెతికితే ఫలితాలు చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి. mplayer అని వెతికితే వచ్చిన ఫలితాలవి. ఫలితాలు వచ్చాక, అందులో మనకు కావాల్సిన ప్యాకేజీ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే, Mark for Installation అని చూపిస్తుంది. అది కొట్టాలి. ఒకవేళ మీరు కోరుకున్న ప్యాకేజీ కోసం ఇంకేమన్నా ప్యాకేజీ లు తేవాలి అంటే అది మీకు చెప్తుంది, సరేనని కొట్టేయ్యండి. అన్నీ మార్క్ చేసాక,సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో పైన Apply అని ఉంటుంది. అది కొడితే, ఎన్ని ప్యాకేజీ లు మార్క్ చేసారు, ఎంత డౌన్లోడ్ చేయాలి, ఎంత నిలువ ఆక్రమిస్తుంది లాంటి వివరాలన్నీ చూపిస్తుంది. సరేనని కొట్టేస్తే ఇన్స్టాల్ చేసేస్తుంది.
౨. ఆడ్/రిమూవ్ అప్లికేషను
ఇది కూడా సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లాంటిదే. కాకపోతే ఇందులో అక్కడ ఉన్నన్ని అమరికలు ఉండవు. కాస్త తేలిగ్గా ఉంటుంది. దీన్ని తెరవాలంటే, మెయిన్ మెనూ లో, Add/Remove Applications ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ప్యాకేజీ వెతుక్కుని టిక్ చేసి, క్రింద Apply అని ఉంటుంది, దాన్ని కొడితే ఇన్స్టాల్ చేసేస్తుంది.
. అప్ట్-గెట్
ఇక టెర్మినల్ ని ప్రాణప్రదంగా చుస్కునే వారికి ఎప్పుడు లోటు చెయ్యదు లినక్సు! మనం మొదట్లో కొన్ని సోర్సులు కలిపాం చూసారు? అవి ఇక్కడ కూడా కలపొచ్చు. ఎలా అంటే, ముందు ఒక టెర్మినల్ తెరిచి పెట్టుకోండి. ఇక క్రింది కంమాండ్లు ఏమేం చేస్తాయో చూడండి.
ls -R /etc/apt//etc/apt డైరెక్టరీ లో మన ప్యాకేజీ మేనేజర్ల వివరాలన్నీ ఉంటాయి.ఆ పై కమాండ్ ఆ డైరెక్టరీ లో ఉన్నవన్నీ చూపిస్తుంది. ఉదాహరణకి, అందులో, /etc/apt/sources.list, /etc/apt/sources.list.d/ లో ఉన్న ఇంకో ఫైల్, రెంటినీ చూడండి. మనం ఇందాక పైన కలిపిన సోర్సులు ఇక్కడ కనబడతాయి. మనం ఇక్కడే కలుపుకోవచ్చు కూడాను. లైన్ కి ముందు deb ఉంటే అది ఒక సోర్సు కి సంబంధించిన లైన్ అని గుర్తించాలి. ఒకవేళ # ఉంటే అది ప్రస్తుతానికి వాడకం లేదని గుర్తిచాలి. ఒకవేళ మీరు దాన్ని వాడాలి అంటే ఆ # ని తీసెయ్యాలి.
ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఒక కమాండ్ తో పని అంటే! ఉదాహరణకి మనం mplayer ఇన్స్టాల్ చేస్కోవాలి అనుకుందాం.
sudo apt-get install mplayerఅని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఒక ప్యాకేజీ ని తీసెయ్యాలి అంటే,
sudo apt-get remove mplayerఅంటే సరిపోతుంది. మీకు ప్యాకేజీ పేరు తెలియకపోతే, ఈ క్రింది కమాండ్ తో శోధించవచ్చు.
sudo apt-cache search mplayerఇంక చెలరేగిపొండి. మీకు అడ్డే లేదు :)
ఫెడోరా ఐతే:
ఏ మాటకి ఆ మాటేనండి! ఉబుంటు లో ఉన్నంత సౌలభ్యం ఇందులో ఉండదు, గత ౫ ఏళ్లుగా చూస్తున్నా సరే, ఉబుంటు కి ఉన్న సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ కి సరితూగగల ప్యాకేజీ మేనేజర్ ఇందులో కానరాలేదు! అలా అని డీలా పడిపోకండి మరి. ఇందులో yum అనే ఒక అద్భుతమైన సాధనం ఉంది. కాకపోతే ఇది టెర్మినల్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో అసలు గ్రాఫిక్స్ అప్లికేషను ఏ లేదని కాదు, ఉన్నా సరే, దానితో సవా లక్ష సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పటికి చాలా మంది ఆన్ లైన్ ఫోరం లలో, వీటి గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. కాబట్టి, అన్నిటికంటే మంచి పద్దతి, మనకేమన్నా కోర్కేలుంటే వాటిని కాసేపు చంపుకుని, yum ని వాడుకోవడమే. మీరు ససేమిరా మేము వాడము, మాకు గ్రాఫిక్స్ విండో కావాలి అంటే, విక్రమార్కులు మరి మిమ్మల్ని ఆపగలమా, అలాగే కానివ్వండి - మెయిన్ మెనూ లో Add/Remove Softwares అని ఉంటుంది, అది నొక్కితే ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా, ఇంక మీ తిప్పలు మీరు పడండి :) Yum వాడతానన్నవాళ్ళు మాత్రం ఇంకా చదవి సుఖపడండి :)ఒక టెర్మినల్ తెరిచి, ఈ క్రింది కమాండ్ కొట్టండి, ఒక ఫైల్ తెరుచుకుంటుంది.
su -c 'vim /etc/yum.conf'ఒకవేళ, మీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చినవారు, మీకు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చి ఉంటే, వాటిని ఈ క్రింది ఫార్మటు లో ఆ ఫైల్ లో ఒక లైన్ గా పెట్టాలి.
proxy=http://192.34.35.11:3128అంటే, URL:port ఫార్మటు అన్న మాట.
ఇక ఆ ఫైల్ ని సేవ్ చేసేసి (ఎస్కేప్ కొట్టి, : కొట్టి, wq కొట్టండి), ఈ క్రింది కమాండ్ కొట్టండి.
ls /etc/yum.repos.dఅక్కడ, మీకు డీఫాల్ట్ గా వచ్చిన రిపాసిటరిలు అన్నీ కనిపిస్తాయి. అందులో మచ్చుకకి ఒక ఫైల్ తెరవండి, క్రింది కమాండ్ తో (ఫైల్ పేరు మార్చుకోండి, ఆ డైరెక్టరీ లో ఏమేమి ఫైళ్లు ఉన్నాయో చూసి)
su -c "vim /etc/yum.repos.d/livna.repo"ఆ ఫైల్ లో ఈ క్రింది ఉన్న లైన్ ఉందేమో చూడండి.
enabled = 0అలా ఉంటే, ఆ రిపాసిటరి ఉపయోగించబడటం లేదు. ఉపయోగించాలంటే, దాన్ని ఈ క్రింది విధంగా మార్చాలి.
enabled = 1ఫెడోరా కి కావాల్సిన చాలా ప్యాకేజీ లు, లివ్నా అనే ఒక రిపాసిటరీ లో ఉంటాయి. అది సెటప్ చేస్కోవడానికి, ఈ క్రింది కమాండ్లు కొట్టండి.
wget -c http://rpm.livna.org/livna-release.rpmఇక అలా, మీకు నచ్చిన రిపాసిటరీలు అన్నీ సరి చేస్కుకున్నాక, ఇక ఇన్స్టాల్ చేస్కోవడం తేలికే. ఉదాహరణకి, mplayer ఇన్స్టాల్ చేస్కుందాం.
rpm -ivh livna-release.rpm
yum -y install mplayerఅని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఆ ప్యాకేజీ ని తీసెయ్యాలి అనుకుంటే,
yum remove mplayerఅంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్యాకేజీ పేరు తెలియక వెతకాలి అనుకుంటే,
yum search video playerఅంటే అదే వెతికి, మీకు ఫలితాల్ని అందిస్తుంది.
మీకు ఇంక ఏమన్నా సందేహాలుంటే అడగండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి