ట్విట్టర్ గురించి "ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?" అనే టపా లో చూశాము. ఇప్పుడు ట్విట్టర్ మన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని లాభం పొందడం ఎలాగో తెలుసుకుందాం.
ట్విట్టర్‌లో ప్రాథమికంగా రెండు ప్రధానాంశాలను మనము గుర్తుంచుకోవాలి. అవి, మనం అనుసరించువారు (following) మరియు మనలను అనుసరించువారు (followers). మనం అనుసరించువారు (following) ఏవైనా ట్వీట్ (tweet) చేస్తే మనకు అవి కనిపిస్తాయి. అలాగే మన ట్వీట్లు (tweets) మనలను అనుసరించువారికి (followers) కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు ఎవరినైనా అనుసరించవచ్చు. మీరు ఎవరినైనా అనుసరించాలంటే వారు మీకు ఖచ్చితంగా తెలుసుండాలని లేదు. అలాగే మిమ్ములను అనుసరించే వారికి కూడా అది వర్తిస్తుంది. ఇవి బాగా గుర్తుకుంచుకున్న పక్షాన, ట్విట్టర్ లో మన గమనం సాఫీగా సాగుతుంది.
1. ఎవరిని అనుసరించాలి
మొదటిగా మనము ఎవరిని అనుసరించాలనేది నిర్ణయించుకోవాలి. మీ అభిరుచులకు అనుగుణంగా ఉండే వ్యక్తులను మీరు అనుసరించవచ్చు. మీ మిత్రులను మీరు అనుసరించవచ్చు. మీ రంగంలో మహోన్నతమైన/విజయవంతులైన/అభిమా
ఎవరైనా తెలియని వారిని అనుసరించడానికి సంకోచించకండి. వారిని అనుసరించిన తరువాత, వారి ట్వీట్‌లు గనక మీకు నచ్చకుంటే అప్పుడు మీరు వారిని అనుసరించడం మానివేయొచ్చు. ట్విట్టర్‌లో మనము ఎవరినైనా తేలికగా అనుసరిచడం మరియు అనుసరిచకపోవడం చేయవచ్చు. మనము క్రమంగా క్రొత్తవారిని అనుసరించడం మరియు మీకు అవసరమైన విషయాలను అందించనివారిని అనుసరించకపోవడం చేస్తుండాలి. అప్పుడే ట్విట్టర్ మనకు చాలా మంచి ఫలితాలనిస్తుంది.
2. ట్వీట్ అంటే ఏమిటి?
ఒక ట్విట్టర్ వాడుకరి తను ట్విట్టర్‌లో వ్రాసే ఏ విషయానినైనా "ట్వీట్" అని చెప్పవచ్చు. అది తను ట్విట్టర్‌లో ఉన్న అందరిని ఉద్దేశించి చెప్పినా, లేక ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి చెప్పినా, లేదా అతని స్వగతం తెలిపినా, అన్నింటిని "ట్వీట్" అనే చెప్పవచ్చు. ట్వీట్ యొక్క ఉదాహరణలు: "ఇన్ఫోసిస్ తన రెండవ త్రైమాసికంలో చాలా మంచి ఫలితాలను సాధించినదని తెలిపింది", "మిత్రులారా, నాకు విండోస్ కన్నా ఉబంటు ఎంతో మేలని అనిపించినది", "నేను ఈ రోజు ఒక క్రొత్త చేతి గడియారం కొంటున్నాను".
3. రీట్వీట్ అంటే ఏమిటి?
రీట్వీట్ అంటే 'తిరిగి ట్వీట్' చేయడం. ఆంగ్లంలో దీనిని RT అని గుర్తించవచ్చు. ట్వీట్ అంటే మాకు అర్థమైనది, ఇప్పుడు రీట్వీట్ ఏంటి? మనతో పాటు ట్విట్టర్‌లో పలువురు వారి భావాలను ట్వీట్‌ల ద్వారా తెలియపరుస్తూవుంటారు, అవి మనకు నచ్చి మనలను అనుసరించేవారికి తెలియపరచాలని అనుకుంటే, ఈ రీట్వీట్ పనికొస్తుంది. ఒకవేళ రాము అనే మీ మిత్రుడు "పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం అన్నారు పెద్దవారు" అని ట్వీట్ ప్రచురించివుంటే, దానిని మీరు "RT @ramu పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం అన్నారు పెద్దవారు" అని మీ పేజీలో రీట్వీట్ చేయవచ్చు. ఈ RT ట్విట్టర్ సంస్థ చిత్రీకరించినది కాదు, ట్విట్టర్ వాడుకరులు వారి సౌలభ్యానికి కనుకున్నారని తెలిసినప్పుడు నేను అవాక్కయ్యాను. ఒకవేళ మీకు ట్వీట్ చేయడానికి ఏమి విషయం లేకున్నా, కొందరి ట్వీట్‌లను RT చేయడం ద్వారా మీకు నచ్చిన వారి భావాలను అందరికి తెలిపిన వారవుతారు.
4. సమాధానాలు/ఉద్దేశించడం
మనము ఒక వ్యక్తి ప్రచురించిన విషయానికి నేరుగా అతనికే జవాబిస్తే , దానిని ట్విట్టర్‌లో సమాధానము(reply) అని అంటాము. ఉదాహరణకు అప్పారావు(ట్విట్టర్‌లో అతని వాడుకరి పేరు apparao అని అనుకుంటాం) "నేను సంగీతం క్లాసుకు వెళ్తున్నాను" అని ప్రచురిస్తే, దానికి నేను "@apparao వీలుంటే సంగీతంతో పాటు సంగీత వాయిద్యమేదైనా నేర్చుకో" అని సమాధానమివ్వచ్చు.
పై ఉదాహరణలో తెలిపిన విధంగా '@' చిహ్నానికి వాడుకరి పేరును జతచేసిన తర్వాత , మనము వారికి తెలియపరచాలనుకునే విషయాన్ని వ్రాసి ప్రచురిస్తే, అది రీట్వీట్ అవుతుంది. ట్విట్టర్ హోం పేజీలో కనబడే ట్వీట్ మీద మౌస్ పాయింటర్‌ను ఉంచినప్పుడు కనిపించే arrow మీద నొక్కితే, ప్రచురణ పెట్టెలో(posting field) '@వాడుకరిపేరు' ప్రత్యక్షమవుతుంది, తర్వాత మనము మన జవాబును వ్రాసి ప్రచురించవచ్చు.
ఉద్దేశించడం కూడా సమాధానం లాగే వుంటుంది. మన ట్వీట్‌లో ఎవరినైనా ఉద్దేశించాలని అనుకున్నప్పుడు వారు ట్విట్టర్‌లో గనక వున్నట్లైతే వారి వాడుకరిపేరును వాడితే, అది వారిని ఉద్దేశించడం అవుతుంది. ఉదాహరణకు "నేను కాలేజిలో చదువుకునే రోజులలో @వాడుకరిపేరు నాకు చాలా సహాయం చేశాడు" అనే ట్వీట్‌లో మనము ఒక ట్విట్టర్ వాడుకరిని ఉద్దేశించడం జరుగుతున్నది.
ప్రతిసారి మనము '@వాడుకరిపేరు' అని వాడినప్పుడు అది ఒక లంకె లాగా తయారవుతుంది. ఆ లంకెను మనము మీటితే ఆ వాడుకరి యొక్క ప్రొఫైల్‌కు వెళ్ళవచ్చు. దీనికి అదునుగా ట్విట్టర్ హోం పేజీలో '@మీవాడుకరిపేరు' కుడి ప్రక్కన కనిపిస్తుంది. దానిని మీరు మీటితే ట్విట్టర్‌లో మిమ్ములను ఉద్దేశించి వ్రాసిన ట్వీట్‌లను మీరు చూడవచ్చు.
5. నేరు సందేశములు(Direct messages)
కొన్ని సందర్భాలలో మీరు ట్విట్టర్ ద్వారా ఎవరికైనా సందేశం పంపించాలి మరియు అది వారికి మాత్రమే చేరాలని భావిస్తే ఈ 'నేరు సందేశాలు' చాలా ఉపయోగకరమైనది. నేరు సందేశాలు ట్విట్టర్.కాం ద్వారా పంపించాలంటే సందేశం పంపించాలనుకునే వ్యక్తి యొక్క ప్రొఫైల్ పేజీకి వెళ్ళి కుడి ప్రక్కన actions క్రింద 'సందేశం (message)'ను మీటి, వారికి మన సందేశమును పంపవచ్చు. ఈ సౌలభ్యం మన సందేశాలను స్పామర్‌ల బారి నుంచి చాలా వరకు కాపాడుతుంది.
ఇంకా చెప్పుకొస్తే, ఈ 'నేరు సందేశములు' ట్విట్టర్‌ను బాగా వాడుతున్నవారి ధ్యానాన్ని మనము చూరగొనవచ్చు. ఎందుకంటే మనము వారిని ఉద్దేశిస్తూ ఎవైనా సందేశాలను ట్వీట్ చేస్తే, వాటిని వారు గమనించకపోయే పరిస్థితుంది. ఇంకా ట్విట్టర్‌ను బాగా వాడేవారికి మనము 'ఈ-తంతి'(email) పంపడంకంటే, ఈ 'నేరు సందేశము'లను పంపించడం ద్వారా వారు మనకు త్వరగా ఉత్తరమిచ్చే అవకాశమున్నది.
6. హ్యాష్ ట్యాగ్‌లు(HashTags)
ట్వీట్‌లో ఎదైనా పదానికి ముందు '#' చిహ్నాన్ని జతచేస్తే దానిని 'హ్యాష్ టాగ్' అని చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు "నాకు నచ్చిన ఆహారం #దోస " అని ట్వీట్ చేస్తే, దాంట్లో '#దోస' హ్యాష్ ట్యాగ్ అవుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్ చలవ వల్ల, ట్విట్టర్‌లో ఒక విషయం పైన జరుగుతున్న చర్చలను మనము ఆ హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో 'వెతకడం(search)' ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఎదైనా ట్వీట్‌లో కనిపించే 'హ్యాష్ ట్యాగ్'ను మీటడం ద్వారా ఆ విషయంపై ట్విట్టర్‌లో ఉన్న అన్నీ ట్వీట్‌లు ప్రత్యక్షమవుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్‌లు ఆంగ్ల పదాలకు case sensitive కావు, అంటే #Ubuntu, #UBUNTU, #ubuntu అన్నీ ఒక్కటిగానే పరిగణిస్తుంది.
7. లంకెలను ప్రచురించడం
ట్విట్టర్‌లో ముఖ్యంగా మనము వ్యాసాలు, చిత్రాలు, వీడియోలు, బ్లాగులకు లంకెలను ప్రచురించడం. ఒక వ్యక్తి ప్రచురించే లంకెలను మంచి ఉపయోగకరమైన అంశాలను అందించే విధంగా ఉంటే మనము వారిని అనుసరించవచ్చు. ఎన్ని లంకెలను అందించారన్నది కాకుండా ఎంత ఉపయోగకరమైన లంకెలను అందించారనది మనము పరిగణలోనికి తీసుకోవాలి.
ట్విట్టర్‌లో వున్న చిక్కేమిటంటే మనము 140 అక్షారాలను మాత్రమే ప్రచురించవచ్చు. మరి క్రొన్ని లంకెలలో 50ను మించి అక్షరాలు వుంటే, వాటిని ట్వీట్ చేసేటప్పుడు మనకు ఇబ్బంది కలగవచ్చు. దీనికి పరిష్కారంగా చాలా మంది URL SHORTNERS ద్వారా లంకెలను 20 అక్షరాలకు లేకా ఇంకా తక్కువకు కుదించవచ్చు. Bit.ly(http://bit.ly), TinyURL(http://tinyurl.com) వంటి సైట్ల ద్వారా లంకెలను కుదించవచ్చు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి